
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించవచ్చు
- మంత్రులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి.. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది.
మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసినవారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ… ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగులో ఉన్నవారితోపాటు.. లే అవుట్లలో విక్రయం కాకుండా పెద్దసంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లే అవుట్‌లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి.. మిగిలిన 90% ప్లాట్లు రిజిస్టరు కాకుంటే ఎల్‌ఆర్‌ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుంలో రాయితీ లభిస్తుంది. ‘‘పేదలు నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని మంత్రులు సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్న ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.