
Love Trap: ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ పేరుతో యువతిపై దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంచివాళ్లమని నమ్మించి, పెళ్లి చేస్తామని చెప్పి యువతిని లైంగిక దాడికి గురిచేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. చదువుకుంటూ ప్రతిరోజూ ఇంటి నుంచి కళాశాలకు ప్రయాణించే అమాయక యువతి.. బస్సులో, ఆటోలో, కళాశాలలో పరిచయమైన ముగ్గురి వలలో చిక్కుకుని ఘోర అనుభవానికి గురైంది. ఒక్కొక్కరుగా దగ్గరవుతూ ప్రేమని నాటకమాడి, ఒక్కో రోజు ఒక్కో చోటుకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడటం మొత్తం జిల్లాలో కలకలం రేపింది.
అనంతపురం నగరంలో డిప్లొమో రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు ప్రతిరోజూ తాడిపత్రి ప్రాంతం నుంచి కళాశాలకు వచ్చి వెళ్తూ ఉండేది. ఈ ప్రయాణంలో పాతూరు ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ గురుమోహన్‌తో పరిచయం ఏర్పడింది. పలుసార్లు మాట్లాడిన తర్వాత అతడు ప్రేమ పేరుతో ఆమెను నమ్మించాడు. ఈ నెల 2వ తేదీన కళాశాల నుంచి పంపనూరు వైపు తీసుకెళ్తున్నట్లు చెప్పి.. చివరికి తన ఇంటికే తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. భయపడిన యువతిని మరుసటి రోజు సొంతూరికి బస్సెక్కించాడు.
అయితే ఇంటికి వెళ్లడానికి ఆమెకు ధైర్యం లేకపోవడంతో ఇప్పటికే బస్సులో పరిచయమైన శింగనమలకు చెందిన ప్రదీప్ వద్దకు వెళ్లింది. దీనిని వాడుకుంటూ ప్రదీప్ కూడా తాను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి తన అద్దె గదికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కడప వెళ్లే బస్సులో పెట్టేశాడు. కడప చేరుకున్న బాధితురాలు అయోమయంలో అక్కడి నుంచి తిరుపతి బయలుదేరింది.
ఇక అక్కడ కళాశాల రోజుల్లో పరిచయం అయిన కదిరి తాలూకాకు చెందిన బ్రహ్మనాయుడికి ఫోన్ చేసింది. అతడు వెంటనే వచ్చి తన గదికి తీసుకెళ్లాడు. ‘నువ్వంటే నాకు నిజంగా ఇష్టం ఉంది, వెంటనే పెళ్లి చేసుకుంటా’ అంటూ నమ్మిస్తూ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆమెను గదిలో ఉంచి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు అక్కడినుంచి తప్పించుకుని తాడిపత్రిలోని స్నేహితురాలి ఇంట్లో ఆశ్రయం తీసుకుంది.
ఇంతలో యువతి ఇంట్లో వారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో బాధితురాలు తిరిగి కుటుంబ సభ్యులను కలిసి జరిగిన అన్నీ వివరాలు చెప్పింది. మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు ఇలా మోసపూరిత ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడిన విషయాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ముగ్గురిపై పోక్సో, ఇతర సంబంధిత సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ప్రేమ పేరుతో యువతులను నమ్మించి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ALSO READ: Shocking: 7,400 మందికి HIV పాజిటివ్.. అందులో 400 మంది చిన్నారులే!





