
క్రైమ్ మిర్రర్, సోషల్ మీడియా డేస్ : అసోంలోని కజిరంగా నేషనల్ పార్కులో ఇటీవల జరిగింది ఓ విస్మయకరమైన ఘటన. ఓ చిన్న పిల్ల ఏనుగు తల్లి నుంచి తప్పిపోయి రోడ్డుపైకి వచ్చేసింది. అది బంధువుల నుంచి దూరమై, భయంతో ఎదురుచూస్తుండగా పార్కు సిబ్బంది ఆ దృశ్యాన్ని గమనించారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ మాజీ ఫారెస్ట్ అధికారి ‘X’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు. పిల్ల ఏనుగు తన తల్లిని వెతికే ప్రయత్నం చేస్తోంది అని గ్రహించిన సిబ్బంది, అది తల్లి వద్దకు తిరిగి వెళ్లే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా పని చేశారు.
అందులో ముఖ్యమైంది. పిల్ల ఏనుగు శరీరంపై తల్లి పేడను పూయడం. ఎందుకంటే చిన్న ఏనుగు శరీరంపై మనిషి వాసన, లేదా వేరే వాసన ఉంటే దాన్ని తల్లి తిరస్కరించే అవకాశం ఎక్కువ. తల్లి ఏనుగు మాత్రమే కాక, సమూహం మొత్తం దాన్ని దూరంగా ఉంచుతుంది. అందుకే పిల్ల ఏనుగు తల్లి వాసనని కలిగి ఉండేందుకు సిబ్బంది పేడను పూసినట్లు ఆ మాజీ అధికారి తెలిపారు. అంతిమంగా తల్లి ఏనుగు దాన్ని గుర్తించి తనవైపు తీసుకెళ్లిందని, ఈ దృశ్యం అందర్నీ ఆనందపరిచిందని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు.