
Leave Story: ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ సెలవులు అడగడం అనేది సహజమే. ఆరోగ్యం బాగోలేదని, కుటుంబ వేడుకలు ఉన్నాయని, ఊరికి వెళ్లాల్సి ఉందని, లేదా వ్యక్తిగత పనులున్నాయని చెప్పి లీవ్స్ తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలాసార్లు నిజమైన కారణం చెప్పకుండా చిన్న అబద్ధం చెప్పి అయినా సెలవు తీసుకునే పరిస్థితులు ఉద్యోగుల్లో కనిపిస్తుంటాయి. అయితే ఢిల్లీలోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసే యువ ఉద్యోగి మాత్రం అందరికీ భిన్నంగా ప్రవర్తించాడు.
తనకు సెలవు ఎందుకు కావాలో ఎలాంటి అబద్ధం లేకుండా, నేరుగా మేనేజర్‌కు మెయిల్ పంపాడు. తన ప్రేయసి ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోతుందని, ఆమెతో ఒక రోజు గడపాలని ఉందని స్పష్టంగా పేర్కొంటూ సెలవు కావాలని కోరాడు. ఈ మెయిల్ చదివిన మేనేజర్ మొదట కాస్త ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఇలాంటి కారణాలు ఎవరూ చెప్పరని, చాలా మంది అబద్ధాలు చెప్పి లీవ్స్ తీసుకుంటారని అతడికి తెలుసు.
అయితే ఆ ఉద్యోగి చూపిన నిజాయితీ మేనేజర్‌ను ఆకట్టుకుంది. ప్రేమ కోసం అయినా నిజం చెప్పి సెలవు అడగడం అరుదైన విషయమని భావించిన మేనేజర్.. ఎలాంటి సంకోచం లేకుండా లీవ్ మంజూరు చేశాడు. అంతేకాదు, ‘‘అబద్ధం చెప్పకుండా నిజం చెప్పావు కాబట్టి ఈ సెలవు నీకే’’ అంటూ సానుకూలంగా స్పందించాడు.
ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడితో ఆపకుండా, ఆ మేనేజర్ ఆ ఉద్యోగి పంపిన మెయిల్‌ను తన లింక్డ్ ఇన్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. ఉద్యోగి నిజాయితీని, మేనేజర్ విశాల మనసును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో నిజాయితీకి కూడా విలువ ఉందని ఈ ఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, వర్క్ కల్చర్ మరింత ఆరోగ్యకరంగా మారుస్తాయి. పనితో పాటు వ్యక్తిగత జీవితానికీ గౌరవం ఇవ్వడం వల్లే మంచి ఫలితాలు వస్తాయని ఈ ఉదాహరణ చెప్పకనే చెబుతోంది.
ALSO READ: Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)





