
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌ల ఉత్పత్తి వరకు కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, మద్యపానం, ఒత్తిడి వంటి కారణాల వల్ల కాలేయంపై భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సహజంగా కాలేయాన్ని శుభ్రం చేసుకునేందుకు కొన్ని విత్తనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చియా విత్తనాలు కాలేయ ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే వాటిలో ముందుంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే చియా విత్తనాలు కాలేయంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. రోజూ పరిమిత మోతాదులో చియా విత్తనాలు తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుందని నిపుణుల సూచన.
జనప విత్తనాలు కూడా కాలేయానికి మేలు చేసే విత్తనాల జాబితాలో ఉన్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ విత్తనాలు కాలేయ కణాల పునర్నిర్మాణానికి సహాయపడతాయి. కాలేయంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి జనప విత్తనాలు ఉపశమనాన్ని ఇస్తాయని చెబుతున్నారు.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాలేయాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది. కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడటంలో ఈ విత్తనాలు కీలకంగా పనిచేస్తాయి. ప్రోటీన్ కూడా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
గుమ్మడి గింజలు కాలేయ డీటాక్సిఫికేషన్‌కు ఎంతో ఉపయోగకరమైనవి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గడంతో పాటు కాలేయ పనితీరు మెరుగవుతుంది. గుమ్మడి గింజలను రోజూ పరిమితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఇవి కాలేయంలో వాపును తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాలేయ కణాలను రక్షించి, ఆరోగ్యంగా ఉంచడంలో అవిసె గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.
ధనియాల గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. కాలేయంలో పేరుకుపోయిన చెడు కొవ్వు, విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ధనియాల గింజలతో చేసిన కషాయం కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
నువ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి కాలేయ కణాలకు పోషణ అందించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గడంలో నువ్వులు సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.
సోంపు గింజల్లో ఉండే ఆంథోల్ అనే సమ్మేళనం కాలేయాన్ని రక్షించే గుణం కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కాలేయంపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
కలోంజి విత్తనాలు కూడా కాలేయ శుభ్రతకు ఎంతో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు కాలేయంలో ఉన్న మలినాలను తొలగించి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. సంప్రదాయ వైద్యంలో కలోంజి విత్తనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
ఈ విధంగా సహజంగా లభించే ఈ 9 విత్తనాలను సరైన మోతాదులో ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: సహజీవనం చేస్తున్న యువతి ఆత్మహత్య.. షాకింగ్ పని చేసిన తల్లిదండ్రులు





