
క్రైమ్ మిర్రర్, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నల్లగొండ పట్టణంలో ఆధ్యాత్మిక సువాసన విరజిమ్మింది. హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా వార్షిక ఉర్సు ఉత్సవాలు గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కుల, మత, జాతి తేడాలు లేకుండా ప్రజలు ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొంటూ సౌభ్రాతృభావాన్ని ప్రతిబింబించారు. ఉర్సు ప్రారంభ సందర్భంగా మదీనా మసీదు నుండి గంధం ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నల్లగొండ పోలీస్ అధికారులు భక్తులతో కలిసి పాల్గొన్నారు. గంధం ఊరేగింపును ఎత్తిన నల్లగొండ పోలీసులు భక్తి భావంతో దర్గా వైపు నడిచారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున డీఎస్పీ శివరాం రెడ్డి గంధాన్ని ఎత్తి, ప్రజలందరూ సుభిక్షంగా, శాంతిగా జీవించాలని అల్లా తాలా దీవెనలు ప్రసాదించాలి అని ఆకాంక్షించారు.
ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత విషయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, అన్ని ఏర్పాట్లను పోలీసులు సమన్వయం చేశారు. రాత్రి గంధం ఊరేగింపుతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే కొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10న దీపాలంకరణ, 11న ఖవ్వాలి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దర్గా పరిసరాలు దీపాలతో ముస్తాబై, భక్తి, శాంతి, ప్రేమ వాతావరణం నెలకొంది.
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి నుంచి మాత్రమే కాకుండా, హైదరాబాద్, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ ప్రాంతాల నుండి కూడా వేలాది భక్తులు ఉత్సవాలకు పాల్గొన్నారని కమిటీ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి పాల్గొన్న భక్తులు దర్గా వద్ద ప్రార్థనలు చేస్తారని అన్నారు. భక్తులు మాట్లాడుతూ, హజరత్ లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా మనకు ఐక్యత, శాంతి, ప్రేమకు ప్రతీక. ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తే మనసుకు ప్రశాంతి లభిస్తుంది అని తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉర్సు ఉత్సవాలు నల్లగొండ నగరానికి ఆధ్యాత్మికతను తీసుకువచ్చాయి.