
మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల గ్రామం, కొంగర ఖుర్దు ఏలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 270 ఎకరాల భూమిని సేకరించనున్నది. ఈ భూములు సర్వే నంబర్ 289లో ఉండగా, దాదాపు 164 మంది రైతులు తమ భూములను కోల్పోనున్నారని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. కందుకూరు డివిజన్ ఆర్‌డిఓ జగదీశ్వర్ రెడ్డి, మహేశ్వరం ఎంఆర్‌వో సైదులు, TSIIC జోనల్ మేనేజర్ శ్రావణ్ కుమార్, జోనల్ అధికారి మహేష్ ఆధ్వర్యంలో సభ జరిగింది.
రైతులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గళాన్ని వినిపించారు. ప్రస్తుతం ఒక ఎకరం భూమికి రూ.8 నుంచి 10 కోట్ల వరకు విలువ ఉన్నదని, ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రతి రైతుకు అభివృద్ధి చేసిన 1000 గజాల ప్లాట్‌లను ఇవ్వాలని, లేదా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామ సభలో భూములు కోల్పోతున్న రైతులు, గ్రామ ప్రజలు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.