Vaikunta Ekadesi: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను అర్చకులు తెరిచారు. వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
ఉదయం 5.00 గంటలకు సర్వదర్శనం
ఉదయం 5.00 గంటలకు సర్వదర్శనం టోకెన్స్ పొందిన భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించారు. ఈ రోజు నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ వైకుంఠ ద్వారా దర్శనాని కల్పించనున్నారు. ఈ వైకంఠ ద్వార దర్శనానికి కోట్లాది మంది భక్తులు తిరుమలకు తరలిరానున్న నేపథ్యంలో.. నేటి నుంచి10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ రోజు నుంచి జనవరి 1వ తేదీ వరకు కేవలం టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ దర్శనాలకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.
తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
ఇక తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా అదికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. అటు వేములవాడ రాజన్నసన్నిధిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.





