
-
పది రోజుల్లోనే చిట్లిన రోడ్లు, అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ : హస్తినాపురం డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంలో తీవ్ర నాణ్యత లోపాలు బయటపడ్డాయి. కేవలం పది రోజులు గడవకముందే రోడ్లు చిట్లిపోవడం, మిశ్రమం వదిలిపోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. కాలనీలో సీసీ రోడ్ల టెండర్‌ను పొందిన సదర్ కాంట్రాక్టర్ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి కాలనీవాసులు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, ఆయన “ఇది పెద్ద విషయం కాదు” అన్నట్టుగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాడని స్థానికులు తెలిపారు. మంగళవారం జరిగిన కొలత పనులు, సీసీ రోడ్లకు వాటర్ క్యూరింగ్ పూర్తికాకుండానే బిల్లుల కొలతలు నిర్వహించడమే, అధికారుల వైఖరిని బహిర్గతం చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.
“రాజుల సొమ్ము రాళ్లపాలు… ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలు” అన్న చందంగా అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలువురు అధికారులు అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కాలనీవాసులు ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు మరియు GHMC ఉన్నతాధికారులు తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.