
వలిగొండ, మే 20 (క్రైమ్ మిర్రర్): మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోతున్న నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, వలిగొండ మండల కేంద్రంలో సిఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాటిలో వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఫ్యాక్టరీ చట్టం, సామాజిక భద్రత కోడ్‌లను పేర్కొన్నారు.
ఈ కోడ్‌లు అమలయ్యితే కార్మికుల కనీస వేతనం, 8 గంటల పని విధానం, సంఘం ఏర్పాటు హక్కులు అన్నీ దెబ్బతింటాయని తెలిపారు. బ్రిటిష్ కాలంలో ఉద్యమించి సాధించిన కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జులై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పైళ్ల గణపతి రెడ్డి, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ నరసింహ, ఉకుర్తి రాములు, ఎడవెల్లి ఎల్లమ్మయ్య, హమాలీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జన్ని జంగయ్య, నరసింహ వలయ్య, వీరస్వామి, అంజయ్య, తాళ్ళ సత్తయ్య, లలిత, రేణుక, పుష్ప తదితరులు పాల్గొన్నారు.