ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు . ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు అక్రమంగా బదిలీ అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దాని ఆధారంగా నిధుల బదిలీపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.
దీని ఆధారంగా ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. . కెటిఆర్ అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే… అరెస్టు తప్పకపోవచ్చని ఎసిబి అధికారులు చెబుతున్నారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు.
తాజాగా కెటిఆర్‌పై కూడా కేసు నమోదు కావడంతో విచారణ వేగవంతం కానుంది. కెటిఆర్‌కి సమన్లు ఇచ్చి విచారణకి పిలువనున్నారు. ఈ కేసులో కెటిఆర్ అరెస్ట్ తప్పదని ముందునుంచీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూనే ఉన్నారు. కెటిఆర్ కూడా ఎప్పటినుంచో ఈ కేసులో తనని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని కెటిఆర్ చెబుతున్నారు. దీనిపై జైలుకి వెళ్ళడానికైనా తాను సిద్ధమని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు.
ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా… అన్న కోణంలోనే ఏసీబీ దర్యాప్తు సాగనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ ఆరా తీయనుంది.. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ గతంలోనే చీఫ్ సెక్రటరీకి సమాధానమిచ్చారు.