
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ సర్కార్ పై యుద్ధం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలు పెట్టారు. సోమవారం హెచ్ఎండీఏ కార్యాలయం దగ్గర మునుగోడు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నా చేశారు. ఆఫీసులోకి లోపలికి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు రైతుల మెరుపు ధర్నా వెనుక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్షన్ ఉందనే చర్చ సాగుతోంది.
రెండు రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురంలో పర్యటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు వచ్చి కోమటిరెడ్డిని కలిశారు. ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ అడ్డగోలుగా మార్చారని.. తమ భూములను బలవంతంగా లాక్కొవాని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. భూములు ఇచ్చేందుకు తాము సిద్దంగా లేమని.. తమను ఆదుకోవాలని రైతులంతా రాజగోపాల్ రెడ్డిని వేడుకున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన కోమటిరెడ్డి.. మునుగోడు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ప్రకంటించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా అలైన్ మెంట్ ఎలా ఫైనల్ చేస్తారని ఫైరయ్యారు. మునుగోడు రైతుల ప్రయోజనాల కోసం రాజీనామాకు సిధ్దమన్నారు. అంతేకాదు ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి.
ప్రభుత్వం మారాలి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. గతంలో చేసినట్లే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే టాక్ వస్తోంది. అందుకే రేవంత్ సర్కార్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారనే వార్తలు వచ్చాయి. రేవంత్ పై ఆయన తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది మాత్రం నిజమేనని చెప్పారు. ఇటీవలే బెంగళూరు వెళ్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. వరుసగా జరుగుతున్న పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అతి త్వరలోనే ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారనే గుసగుసలు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయి.