తెలంగాణ

రాజగోపాల్ రెడ్డిపై సీఎం రేవంత్ పగ! మారిన RRR అలైన్ మెంట్

రీజనర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అంశం ఇప్పుడు నల్గొండ జిల్లాలో సెగలు రేపుతోంది. మునుగోడు నియోజకవర్గం మండిపోతోంది. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బాధిత రైతుల ఆందోళనలే కనిపిస్తున్నాయి. పచ్చని పొలాల గుండా రీజనల్ రింగ్ రోడ్డు వేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడే మరో సంచలన విషయం వెలుగులోనికి వస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గానే ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చారనే టాక్ వస్తోంది. తనకు కొరకరాని కొయ్యగా మారిన రాజగోపాల్ రెడ్డిని ఇరుకున పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వెశారని అంటున్నారు.

నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ట్రిపుల్ ఉత్తర, దక్షిణ భాగాలకు అలైన్ మెంట్లు ఖరారయ్యాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ కూడా దాదాపుగా పూర్తైంది. అయితే ఇటీవలే దక్షిణ భాగం అలైన్ మెంట్ వచ్చింది. ఇందులో పాత అలైన్ మెంట్ లో చాలా మార్పులు కనిపించాయి. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం పరిధిలో ట్రిపుల్ ఆర్ అష్ట వంకర్లు తిరిగింది. ఇదే ఇప్పుడు చక్చగా మారింది. మునుగోడు పరిధిలోనే ఎందుకిలా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అలైన్ మెంట్ లో సంస్థాన్ నారాయణపురం పరిధిలో పెద్దగా ప్రభావం లేదు. మర్రిగూడ మండలం కూడా అంతే. కాని కొత్తగా వచ్చిన అలైన్ మెంట్ లో మాత్రం సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ మండలాల్లో వేలాది ఎకరాల్లో ట్రిపుల్ ఆర్ కోసం ఇవ్వాల్సి వస్తోంది. చౌటుప్పల్ మండలంలోనూ గతంలో కంటే వేల ఎకరాలు అధికంగా పెరిగాయి.

గతంలో ఉన్న అలైన్ మెంట్ ను దాదాపు 12 కిలోమీటర్లు ముందుకు జరపడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ రైతులు నష్టపోయేలా అలైన్ మెంట్ మార్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. దీంతో అతన్ని డ్యామేజీ చేసేలా కొత్త అలైన్ మెంట్ ఖరారు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో రైతులు తిరగబడితే.. అది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనే పడుతుందని సీఎం రేవంత్ టీం ప్లాన్ గా తెలుస్తోంది. ఈ విషయం గ్రహించిన రాజగోపాల్ రెడ్డి మరింత దూకుడు పెంచారని తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అవసరమైతే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రైతులతో కలిసి ఉద్యమం చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. తనమీద కోపంతో మునుగోడు రైతులను గోస పెట్టడం ఏంటని కోమటిరెడ్డి రగిలిపోతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button