
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ ఓటమిని విశ్లేషించుకుని తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొంటూనే, కాంగ్రెస్ విజయంలో ఎంఐఎం కీలక పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఇప్పటివరకు కార్పొరేటర్ స్థాయి విజయం కూడా సాధించలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో పార్టీ బలహీనత స్పష్టమైందని అన్నారు. ఎంఐఎం సహకారం, భారీ మొత్తంలో ఖర్చుతోనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి చేసిన పనేమిటి అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. రెండు పార్టీలూ కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించకపోయిందని ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి సాధించడమే తమ లక్ష్యం అని వెల్లడించారు.
ఇక బీహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచి భారీ విజయాన్ని అందించారని, కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణల ప్రచారం ప్రజలు తిరస్కరించారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అవసరమని, జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా లోపాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రజల దృష్టిలో విశ్వాసాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు.





