
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ప్రముఖులంతా నివాళి అర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నేతలంతా మన్మోహనుడి సేవలను కొనియాడుతున్నారు. శనివారం ఉదయం అధికార లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. మన్మోహన్ సింగ్ కు సంతాపంగా శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు పార్టీ బృందం హాజరుకానుంది. అధినేత కేసీఆర్ ఆదేశాలమేరకు దివంగత మాజీ ప్రధానికి నివాళులర్పించనున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధర్వంలోని పార్టీ ఎంపీలు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు గా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారని మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ ఉందని చెప్పారు. కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా మన్మోహన్ సింగ్ అందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు, టిఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారన్నారు. మన్మోహన్ ప్రధానిగా వున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో తనకు వారందించిన సహకారం మరువలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని తెలిపారు.