తెలంగాణరాజకీయం

కాంగ్రెస్‌లోకి కవిత.. పీసీసీ చీఫ్ క్లారిటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కవితనే స్వయంగా నిజాలు బయటపెడుతున్నారని, కేసీఆర్ కుటుంబ అవినీతిని ఆమె మాటలే రుజువు చేస్తున్నాయని అన్నారు.

తాము గతంలో చేసిన ఆరోపణలకు కవిత వ్యాఖ్యలే సమాధానంగా నిలుస్తున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి నిజమేనని ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలే ఆ పార్టీ పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోందని పీసీసీ చీఫ్ తెలిపారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని పార్టీ ఖరారు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని, ఒక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్, కోదండరామ్ విషయంలో మంచి స్పందన వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. ప్రస్తుతం పదవులు తక్కువగా ఉండగా ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, అందుకే సంతులనం అవసరమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ తరఫున ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, విస్తృత సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నారో వారికే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

బీజేపీపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. రాముడికి, బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. తాము హిందూ సంప్రదాయాలు పాటిస్తామని కానీ హిందూ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు.

తనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య పూర్తి సాన్నిహిత్యం ఉందని పీసీసీ చీఫ్ వెల్లడించారు. మంత్రులకు, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తేల్చిచెప్పారు. ఇతర మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోరని, మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని చెప్పారు. డీ సెంట్రలైజేషన్ విధానంలో భాగంగానే మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

జిల్లాల పునర్విభజన అంశంపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి మరో జిల్లా ఇచ్చినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మండిపడ్డారు. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

సికింద్రాబాద్ అంశంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు గాబరాపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే వారు ఎంత ఇబ్బంది పడతారో మీడియా అర్థం చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగాల అంశంలో కూడా పీసీసీ చీఫ్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. గత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో నిరుద్యోగులు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అందుకే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ALSO READ: నిండుగా బట్టలు వేసుకొమ్మంటే.. హోంగార్డును కొట్టిన యువతి (VIDEO)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button