ఆ పార్టీతో కవిత పొత్తు!

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, తెలంగాణ జాగృతి వేదికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కే.కవిత ఇప్పుడు పూర్తిగా స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసిన కవిత.. ప్రత్యేక అజెండాతో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏర్పాటు విధివిధానాలు ఇంకా ఖరారవుతున్న దశలోనే, తాజాగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలోనే బుధవారం జనవరి 28, 2026న తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి విడిపోయి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న కే.కవిత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మధ్య వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కాకముందే ఎన్నికల బరిలోకి దిగేందుకు ఈ పొత్తు కీలక మలుపుగా భావిస్తున్నారు.

బుధవారం సాయంత్రం జరిగిన తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి ఉన్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జావేద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు కె.బుచ్చి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కే.కవితతో కలిసి మీడియా ముందుకు వచ్చి పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల వరకే పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా రెండు సంస్థలు కలిసి పనిచేయాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని వారు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, స్థానిక అంశాలపై ఫోకస్, ప్రజల్లోకి వెళ్లే అజెండా వంటి అంశాలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించినట్టు నేతలు తెలిపారు. తెలంగాణ జాగృతి సామాజిక, మహిళా, బీసీ వర్గాల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటే, ఫార్వర్డ్ బ్లాక్ తన చారిత్రక రాజకీయ అనుభవంతో బలమిస్తుందని భావిస్తున్నారు. ఈ పొత్తు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపించాలనే లక్ష్యంతో రెండు పక్షాలు ముందుకు సాగుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కే.కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. సొంత పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి, కొత్త రాజకీయ శక్తిని నిర్మించాలనే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తేలనుంది. అయితే, పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా కవిత తన రాజకీయ దూకుడును స్పష్టంగా చాటినట్టుగా భావిస్తున్నారు. ఈ పొత్తు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

ALSO RAED: Union Budget 2026: బడ్జెట్‌లో తెలంగాణకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button