Kavita comments: ‘కేటీఆర్‌ది నియంత్రృత్వ, రాచరికపు పోకడ’.. కవిత సంచలన వ్యాఖ్యలు

Kavita comments: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి.

Kavita comments: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ పార్టీ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఈ విషయంలో మళ్లీ ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రతిరోజూ అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తుంటారని, ప్రతి వ్యక్తి మాట్లాడిన ప్రతి అంశానికి వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నామని ఆయన తేల్చి చెప్పారు.

కేటీఆర్ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అధిష్టానం వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగం పెరగడంతో పాటు, ఈ అంశంపై నేతల వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో అదనపు వ్యాఖ్యలకు తావివ్వకుండా ఉండేందుకే కేటీఆర్ ఈ తరహా స్పందన ఇచ్చారన్న చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన అంశాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పడం ద్వారా, ఈ అంశాన్ని ఇక ముగించినట్టేనని ఆయన సంకేతాలిచ్చినట్లు పలువురు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే తాను తప్పకుండా వెళ్తానని కవిత స్పష్టం చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేసినా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. చెడ్డ వ్యక్తులు అభ్యర్థులుగా నిలబడ్డా వారికి ఓటు వేయాలా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.

కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో కులం కాదు, గుణం చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బు చూసి కాదు, నిజంగా పని చేసే వ్యక్తికి ఓటు వేయాలంటూ సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారిని ఆదరించాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం, సేవాభావమే ప్రధానమని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కవిత వెల్లడించారు. ప్రజలు ఆలోచించి, తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయాలను మరోసారి బహిర్గతం చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ పేరుతో కఠిన వైఖరి, మరోవైపు ప్రజాస్వామ్య విలువల పేరుతో బహిరంగ విమర్శలు.. ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ALSO READ: నడిరోడ్డుపై అర్థనగ్నంగా కానిస్టేబుల్ వీరంగం.. భార్యాబిడ్డలపై క్రూరంగా దాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button