
నేటి జీవనశైలిలో మెడ నొప్పి, వెన్నునొప్పి సమస్యలు సాధారణంగా మారిపోయాయి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే స్పాండిలోసిస్, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ఈ సమస్యలకు చాలా సార్లు చిన్న మార్పే పెద్ద ఉపశమనం ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో దిండు వినియోగంలో చేసే పొరపాట్లే అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ బక్తియార్ చౌదరి కీలక సూచనలు చేశారు. మెడ లేదా వెన్నునొప్పి ఉన్నవారు తప్పనిసరిగా తల కింద దిండు పెట్టుకొని పడుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు నొప్పి ఎక్కువ అవుతుందనే భయంతో దిండు లేకుండా పడుకుంటారు. కానీ అది మరింత సమస్యలను పెంచే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు.
దిండు మరీ ఎక్కువ ఎత్తుగా కూడా ఉండకూడదు, అలాగే చాలా పలుచగా కూడా ఉండకూడదని ఆయన సూచించారు. దిండు ఎత్తు సరైన స్థాయిలో లేకపోతే మెడపై ఒత్తిడి పెరిగి నొప్పులు తీవ్రమవుతాయని చెప్పారు. ఒకవైపు తిరిగి పడుకున్నప్పుడు తలకు, భుజానికి మధ్య ఉండే ఖాళీలో దిండు సరిగ్గా ఇమిడిపోవడం చాలా ముఖ్యమని వివరించారు. అలా ఉండడం వల్ల మెడ, వెన్నెముక సహజ స్థితిలో ఉండి నొప్పులు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.
పడుకున్న తర్వాత తల పైకి లేవకుండా, కిందకు వాలకుండా సమాంతరంగా ఉండాలని డాక్టర్ బక్తియార్ చౌదరి సూచించారు. తల వంగిన స్థితిలో ఎక్కువసేపు ఉంటే మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి ఉదయం లేవగానే నొప్పి ఎక్కువగా అనిపిస్తుందని అన్నారు. అందుకే నిద్రలో తల, మెడ, వెన్నెముక ఒకే లైన్‌లో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
కేవలం మెడ నొప్పే కాకుండా, కళ్లు తిరగడం, తలనొప్పి, స్పాండిలోసిస్ వంటి సమస్యలకు కూడా సరైన దిండు ఒక సులువైన పరిష్కారంగా మారుతుందని డాక్టర్ పేర్కొన్నారు. చాలాసార్లు మందులు లేకుండానే, సరైన నిద్ర విధానం వల్ల సమస్యలు తగ్గిపోతాయని చెప్పారు. కాబట్టి ఖరీదైన చికిత్సలకంటే ముందు నిద్రించే విధానంలో మార్పు చేసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ALSO READ: మళ్లీ 4 రోజులు స్కూళ్లకు సెలవులు..?





