క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వారంతా సైలెంట్ అయ్యారు. ఒకరిద్దరు తప్ప పెద్దగా నేతలు మాట్లాడింది తక్కువ. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పదిమంది చాలా దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ మోహన్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉండేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి నేతలకు కౌంటు డౌన్ ప్రారంభం అయింది. కొంతమంది పై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. నెలల తరబడి రిమాండ్లు సైతం కొనసాగాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అందులో ఒకరు మాజీమంత్రి కొడాలి నాని.
చాలా రోజుల తర్వాత…
చాలా రోజుల తర్వాత కొడాలి నాని మళ్లీ బయటకు వచ్చారు. మాజీమంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను చాలా మంది వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు. అనూహ్యంగా కొడాలి నాని పరామర్శించడంతో హాట్ టాపిక్ అయింది. కేవలం ఆయన పరామర్శకి పరిమితం కాలేదు కూటమి నేతలకు డెడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తద్వారా తన పాత ధోరణిని బయటకు తీశారు. ఇకనుంచి యుద్ధమే అన్నట్లు మాట్లాడారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ చేశారు. దీంతో తాను యాక్టివ్ అవుతానని గట్టి హెచ్చరికలే పంపారు కొడాలి నాని.
చాలా దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. వారిపై నిరంతరం వ్యక్తిగత దాడి చేసేవారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ అంతటా జరిగింది. ఆయన అరెస్టు తప్పదని సంకేతాలు కూడా వచ్చాయి. ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో తర్వాత జరిగే అరెస్ట్ కొడాలి నాని దేనని ప్రచారం నడిచింది. కానీ ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. బైపాస్ సర్జరీ చేసుకున్నారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంబటి రాంబాబును పరామర్శించడం ద్వారా తిరిగి తాను యాక్టివ్ అయ్యానని సంకేతాలు పంపించారు. కేసులు ఎదుర్కోవడంతో పాటు అరెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసేదాకా విశ్రమించబోనని చెప్పుకొచ్చారు.
టీడీపీ ద్వారా ఎంట్రీ..
కొడాలి నాని తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో తొలిసారిగా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో సైతం రెండోసారి గెలిచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టిడిపి నాయకత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకించారు. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అటువైపు వెళ్లారు. 2014లో సైతం వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మారారు. 2019లో నాలుగోసారి గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన కొడాలి నానిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి కొడాలి నాని హవా మరింత పెరిగింది. ఐదేళ్ల వైసిపి హయాంలో ఆయన చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. కానీ 2024 ఎన్నికల్లో కొడాలి నాని కి షాక్ తగిలింది. గుడివాడ నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేదని అంబటి రాంబాబును పరామర్శిస్తూ తేల్చి చెప్పారు కొడాలి నాని. మొత్తానికి అయితే కొడాలి నాని యాక్టివ్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా 2029లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం తద్యమంటూ పేర్కొన్నారు.
