
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్‌ను ఉదయం ఆమె నివాసం వద్ద నుంచే పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. తన సొంత డివిజన్‌లో జరుగుతున్న ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా దూరం పెట్టిన తర్వాత, ప్రశ్నించేందుకు వెళ్లేందుకు సిద్ధమైన దశలో పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శ్రీవాణి మాట్లాడుతూ, “ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? ప్రజల గొంతును అణచాలనే ప్రభుత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి గొప్ప అవమానం” అని పేర్కొన్నారు.
విదేశీ మహిళలకు పాదాభిషేకం, బంగారు బహుమతులు – తెలంగాణ మహిళలపై అరెస్టులు..! ఆమె ఆగ్రహంతో మాట్లాడుతూ, “ఒకవైపు విదేశీ మహిళల పాదాలు మన తెలంగాణ బిడ్డల చేత కడిగిస్తే… మరోవైపు ఇక్కడి ఆడబిడ్డలు ప్రభుత్వ హామీల గురించి ప్రశ్నిస్తే, తెల్లవారుజామునే అరెస్టు చేస్తున్నారంటే, ఇది ప్రశ్నలకే భయపడే పాలన” అని ఆరోపించారు.
శ్రీవాణి అంజన్ కుమార్ తాను ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికయ్యానని, ప్రజా సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్న తనను నిరుద్యేశంగా టార్గెట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆమె ప్రశ్నలు స్పందించారు. “ఇదేనా ప్రజల పాలన? ఇదేనా ప్రజాస్వామ్యం?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు. పదవుల్లో ఉండటం వల్ల ఎవరి చేతుల్లోనైనా అధికారాలున్నాయి. కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించేందుకు నిజమైన సేవే మార్గంమే కానీ మా గొంతులను అణచాలంటే మీరు ఎన్ని అరెస్టులైనా చేయండి. ప్రజల కోసం మా పోరాటం ఆగదు,” అని హెచ్చరించారు.