
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు. వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా భూమిని సేకరించబోతున్నారు. కినీవిని ఎరుగని స్థాయిలో… అందరూ అబ్బురపడేలా రాజధాని నిర్మించాలని డ్రీమ్‌గా పెట్టుకున్నారు చంద్రబాబు. ఈ విషయంలో మొదట్లో అందరూ చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల టాపిక్ వచ్చినప్పుడు… చాలా మంది వ్యతిరేకించారు. రాజధాని అమరావతి కోసం పోరాడారు. ఒక రకంగా… 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక కీలక అంశం. కానీ… ఇప్పుడు ఇదే రివర్స్ అవుతోంది. స్థానిక రైతులు కూడా… అమరావతి విషయంలో చంద్రబాబు తీరును ప్రశ్నిస్తున్నారు. కూటమి పాలన కంటే… జగన్ హాయంలోనే బాగుందంటూ నిటూరుస్తున్నారు. దీంతో… చంద్రబాబుకు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌కే డ్రాబ్యాక్ అవుతోందన్న చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది…?
అమరావతిని రాజధానిగా చేస్తామంటే.. తాము కూడా బాగుపడతామే ఉద్దేశంలో అక్కడ ఉంటున్న చాలా మంది రైతులు… మూడు పంటలు పండే భూములను ప్రభుత్వానికి ఇచ్చేశారు. రైతుల భూములు తీసుకున్న సమయంలో.. అప్పటి చంద్రబాబు సర్కార్… వారి భూములను ఫ్లాట్స్‌గా డెవలప్ చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ.. ఇప్పటి వరకు అది జరగలేదు. ఎప్పటికి జరుగుతుందో కూడా తెలియదు. భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. అది చాలదన్నట్టు… ఇప్పుడు మరో 20వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం ప్రజాభిప్రాయ సేకరణలు కూడా చేపట్టింది. కానీ.. అక్కడ అధికారులకు ఎదురుదెబ్బలు తగిలాయి. తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఎదురుతిరిగారు.
పైగా.. అమరావతిపై ఎంతో డబ్బు ఖర్చు పెడుతోంది ఏపీ ప్రభుత్వం. కానీ.. వరద వస్తే.. అంతా మునకే. ఇటీవల రెండు రోజులు కురిసిన వర్షానికే అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ పునాదులు కూడా నీట మునిగాయన్న వార్త చక్కర్లు కొట్టింది. ఇంకా భారీ వర్షాలు, తుఫాన్లు వస్తే.. అమరావతి పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్న కూడా ప్రజల్లో మొదలైంది. అన్ని కలిసి… అమరావతిపై మెల్లమెల్లగా ప్రజల్లో, స్థానిక రైతుల్లో నిరుత్సాహం ఏర్పడుతోంది. ఇది నిరుత్సాహం, నిట్టూర్పులు పెరుగుతూ పోతే… దంతా ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారితే… కూటమి సర్కార్ పరిస్థితి ఏంటి…? అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.