Tuesday, March 10, 2026
HomeతెలంగాణTelangana Politics: బిజెపితో బీఆర్ఎస్ పొత్తు.. ఫుల్ క్లారిటీ!

Telangana Politics: బిజెపితో బీఆర్ఎస్ పొత్తు.. ఫుల్ క్లారిటీ!

* నేతల కట్టడికి గులాబీ పార్టీ వ్యూహం

* విరుగుడుగా కాషాయ దళం స్పష్టత

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. గతంలో రెండుసార్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపిల మధ్య భారీ యుద్ధమే నడుస్తూ వస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత గులాబీ పార్టీ పరిస్థితి మారింది. బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. కాదు కాదు కాంగ్రెస్ పార్టీతో బిజెపికి చీకటి ఒప్పందం ఉందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. అదే సమయంలో గులాబీ పార్టీతో బిజెపికి చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక బిజెపి కార్నర్ అవుతుంది. ఇటువంటి ఆరోపణలు వచ్చిన క్రమంలో బిజెపి ఎన్నడు ఖండించలేదు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామ్ చందర్రావు మీడియా ముందుకు వచ్చి.. గులాబీ పార్టీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం కొత్త సంకేతం.

బిజెపి గట్టి ప్రయత్నాలు..

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఎనిమిది సీట్లు దక్కాయి. అయితే 2018 కంటే ఆ పార్టీకి బలం పెరిగింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 8 పార్లమెంట్ సీట్లను సొంతం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అది మొదలు తెలంగాణలో అధికారానికి దగ్గరగా ఉన్నామన్న నమ్మకం బిజెపి నేతల్లోకి వచ్చింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో బలమున్న గులాబీ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారం నడిచింది. ఆ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే గత కొంతకాలంగా ఈ ఆరోపణ ఉన్న తాజాగా.. బిజెపి తెలంగాణ చీఫ్ అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది.

ఆ నమ్మకం తోనే..

రెండుసార్లు గులాబీ పార్టీకి, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం బిజెపికి ఛాన్స్ ఇస్తారని కాషాయ పార్టీ దళం నమ్మకంతో ఉంది. అందుకే బీఆర్ఎస్ తో తమకు పొత్తు లేదని.. భవిష్యత్తు అంతా తమదేనని బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమ వైపు ఉన్నారని… గులాబీ పార్టీ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందున క్లారిటీ ఇచ్చామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బిజెపి నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది.

చేరికలకు చెక్..

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీ నుంచి బిజెపిలోకి చేరికలు ప్రారంభం అయ్యాయి. కానీ క్రమేపి అవి తగ్గు ముఖం పట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి కేసులతో వెంటాడుతుండడంతో ఎక్కువమంది బిజెపి వైపు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీ స్వరం మార్చింది. వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉంటుందని చెప్పడం ద్వారా నాయకులు బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. అది వ్యూహంలో భాగమేనని అర్థమవుతోంది. మొత్తానికి అయితే తెలంగాణలో సరికొత్త రాజకీయ క్రీడకు తెరతీసింది గులాబీ పార్టీ. దానికి విరుగుడుగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments