అమెరికా, ఇజ్రాయెల్‌తో రెండు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇందుకు మూడు కీలక షరతులు విధించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం రష్యాతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
మూడు కండీషన్లు పెట్టిన ఇరాన్
యుద్ధాన్ని ఆపాలంటే ముందుగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధ హక్కులను అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించాలని పెజెష్కియాన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ యుద్ధం కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవని అంతర్జాతీయ స్థాయిలో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.
మరోవైపు హెచ్చరికలు కూడా!
మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన సీనియర్ అధికారి అలీ ఫదావీ, అవసరమైతే దీర్ఘకాల యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలని అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. సలాలాహ్ నౌకాశ్రయంపై జరిగిన దాడిపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు ఒమన్ అధికారిక మీడియా తెలిపింది.
వెనక్కి తగ్గేది లేదంటున్న ఇజ్రాయెల్!
అటు యుద్ధం ముగింపుకు అమెరికా సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తమ లక్ష్యం పూర్తిగా సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం.
