అమరావతి, క్రైమ్ మిర్రర్: రోడ్లు బాగుంటే రవాణ మార్గం సులభం అవుతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున హైవేల నిర్మాణం చేపడుతుంది. రాష్ర్టంలో 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు గోదావరి పుష్కరాలలోపే అందుబాటులోకి తెచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఈసందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
పోర్ట్ కనెక్టివిటి పెంచాలి…
రాష్ట్రంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణం కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘పోర్ట్ కనెక్టివిటీ’ని పెంచాలని సూచించారు. గుజరాత్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల లాజిస్టిక్స్ వ్యయం తగ్గి, ఎగుమతులు, దిగుమతులు వేగవంతం అవుతాయని, తద్వారా పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
గోదావరి పుష్కరాల లోపే రహదారుల నిర్మాణం…!
రాష్ర్టంలో జరుగబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రహదారుల మరమ్మతులు, నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం సుమారు రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో జరిగే రోడ్ల అభివృద్ధి పనులు రాష్ట్రానికే రోల్ మోడల్‌గా ఉండాలని నిర్దేశించారు.
