ISRO PSLV Mission Failure: అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఇస్రోకు 2026 ఏడాది ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయాణ సమయంలోనే అంతరిక్షంలో దారితప్పింది. దేశ రక్షణ రంగానికి, వాతావరణంలో సంభవించే మార్పుల గురించి తెలుసుకునేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన ఈవోఎస్ -ఎన్1 ఉపగ్రహంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ఫెయిల్ అయ్యింది.
ఇంతకీ అసలు ఏం జరిగింది?
శ్రీహరికోటలోని షార్ నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు నింగిలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ-62 రాకెట్ గమనం తొలి నుంచీ శాస్త్రవేత్తల ఆశించిన మేరకు సాగలేదు. అయినా తొలి మూడు దశలను నిర్దేశిత సమయానికే పూర్తి చేసుకుంది. తర్వాత వేగం తగ్గింది. నాలుగో దశ ప్రారంభం కాగానే ద్రవ ఇంధనంతో కూడిన మోటారులో మంటలు ఆగిపోయి నేరుగా వెళ్లాల్సిన రాకెట్ ఒక్కసారిగా ఒకేచోట రౌండ్లు తిరుగుతూ చక్కర్లు కొట్టింది. షెడ్యూల్ ప్రకారం 18.9 నిమిషాల్లో ఈవోఎస్ -ఎన్1తోపాటు మిగిలిన ఉపగ్రహాలనూ కక్ష్యలోకి చేర్చాలి. 8 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో.. భూపరిశీలన కోసం పంపిన వ్యూహాత్మక ఉపగ్రహం ఈవోఎస్ -ఎన్1 సహా వివిధ దేశాలకు చెందిన మొత్తం 16 ఉపగ్రహాలనూ ఇస్రో కోల్పోయింది. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ నారాయణన్‌తో పాటు శాస్త్రవేత్తలు చూస్తూ ఉండిపోయారు. రాకెట్ గమనాన్ని మార్చేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్లలేదని, సమస్యకు కారణాలను విశ్లేషించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. దీనిపై వైఫల్య విశ్లేషణ కమిటీ విచారణ చేపడుతుందని చెప్పారు.
8 నెలల్లో వరుసగా రెండోసారి
ఇస్రో 1993లో పీఎస్ఎల్వీ వాహక నౌకను అభివృద్ధి చేసింది. ఈ రాకెట్ ద్వారా ఇప్పటి వరకు 64 ప్రయోగాలు చేపట్టింది. అందులో 60 విజయవంతమైతే.. నాలుగు విఫలమయ్యాయి. అయితే వరుసగా రెండుపీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలమవడం మాత్రం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. గతేడాది మే 18న చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ప్రయోగంతోపాటు తాజాగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంఇస్రో శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. పీఎస్ఎల్వీ-సీ61 అపజయంతో ఇస్రో ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని కోల్పోవాల్సి వచ్చింది.





