
Relationship trends: నేటి యువతలో పెళ్లి, ప్రేమ, డేటింగ్ వంటి అంశాల విషయానికి వస్తే గతంలో ఉన్న సంప్రదాయ అభిప్రాయాలు క్రమంగా మారుతున్నాయి. ముందు ఎత్తు, రంగు, వయస్సు వంటి అంశాలను కఠినంగా పరిశీలించి భాగస్వామిని ఎంపిక చేసుకునే వారు, ఇప్పుడు తమ ఇష్టాలు, భావోద్వేగాలు, వ్యక్తిత్వ సరిపోలికను ముఖ్యంగా భావిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ సైట్ల పరిశీలనల్లో ఒక ప్రత్యేకమైన ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పొట్టిగా ఉన్న అమ్మాయిల్లో తమకంటే చాలా ఎక్కువ ఎత్తున్న అబ్బాయిలతో రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనే కోరిక పెరుగుతుందట. 6 అడుగులకు పైబడిన అబ్బాయిలను “పర్ఫెక్ట్ మ్యాచ్”గా భావిస్తూ, సాధారణ ఎత్తు ఉన్న వారిని ముందుగానే పక్కన పెట్టేస్తున్నారని బంబుల్, టిండర్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు వెల్లడించాయి. ఒకప్పటి ఈడు, జోడు భావన స్థానంలో ఇప్పుడు “హైట్ డామినెన్స్” అనే కొత్త అభిరుచి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
వీరికి కావాల్సిన భాగస్వామి విషయంలో ఎత్తే ప్రధాన ప్రామాణికంగా మారింది. డేటింగ్ యాప్స్‌లో మహిళలలో దాదాపు సగం మంది తమ భవిష్యత్ భాగస్వామి కనీసం 6 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉండాలని తమ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో పేర్కొంటున్నారు. ముఖ్యంగా 50% పైగా పొట్టి అమ్మాయిలు ఇలా చేస్తుండటం గమనార్హం. ఈ కారణంగా సగటు ఎత్తుకంటే కొంచెం తక్కువగా ఉండే పురుషులు ప్రాథమిక మ్యాచింగ్ దశలోనే ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతున్నారు. ఉభయపక్షాల మధ్య సంభాషణ మొదలయ్యే అవకాశమే 10% కంటే తక్కువగా ఉందట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహిళల్లో 70% వరకు హైట్‌ను ప్రేమలో అత్యంత కీలక అంశంగా చూస్తుండగా, వాస్తవంగా 6 అడుగుల ఎత్తున్న పురుషులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ శాతమే ఉన్నారు. ఉదాహరణకు అమెరికాలో 6 అడుగుల కంటే పైబడిన పురుషులు కేవలం 14.5% మాత్రమే. అయినప్పటికీ మహిళల్లో 71% మంది 6 అడుగుల నుండి 6 అడుగుల 6 అంగుళాల మధ్య ఉన్న అబ్బాయిలను ‘ఐడియల్ పార్ట్నర్’గా కలలు కంటున్నారు. ఈ గొప్ప ఎత్తు కోరిక చాలా మందికి సంబంధాలు ఆలస్యమవ్వడానికి, పెళ్లిళ్లు జరగకపోవడానికి కూడా కారణమవుతోంది.
మానసిక నిపుణుల దృష్టిలో చూస్తే ఈ మొత్తం ట్రెండ్ ఒక మానసిక భద్రత భావన నుంచే పుట్టుకొస్తోందట. పొట్టి అమ్మాయిలు పొడుగైన అబ్బాయిలను చూసి “సేఫ్, ప్రొటెక్టివ్, స్ట్రాంగ్” అనే భావనను పొందుతున్నారని వారు పేర్కొంటున్నారు. కానీ ఈ ధోరణి పురుషుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 5 అడుగులు 8 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న పురుషులు తమ హైట్ కారణంగా అమ్మాయిలకు నచ్చరేమోనని భావిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు మహిళలలో కేవలం 15% మాత్రమే హైట్‌ను పెద్దగా పట్టించుకోకుండా వ్యక్తిత్వం, మంచితనం, కుటుంబ విలువలను ప్రాధాన్యంగా చూస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా, పాప్ కల్చర్ ప్రభావంతో కొత్త రకం హైట్ ఆధారిత ఎంపిక సామాన్యంగా మారుతున్నప్పటికీ, అది ప్రేమ, సంబంధాల అసలు విలువ ఏమిటన్న ప్రశ్నను సమాజం మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లుగా చేస్తోంది.
ALSO READ: Crypto scam: పోలీసు శాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం?





