బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టింది. మబ్బులు కమ్మేశాయి. బుధవారం మొదలైన ముసురు గురువారం కూడా కొనసాగింది. గురువారమంతా సూర్యుడి జాడే కనిపించలేదు. మిట్టమధ్యాహ్నం దాటినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో రాత్రి టెంపరేచర్లు పగటి టెంపరేచర్లకు నాలుగైదు డిగ్రీలకన్నా తక్కువగానే నమోదయ్యాయి.
ఇవాళ పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తాయని తెలిపింది. శనివారం నుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది.
హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో గురువరం మోస్తరు వర్షం కురిసింది.రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జనగామ, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వర్షపాతం కొంచెం ఎక్కువగా రికార్డయింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాయత్రినగర్‌లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రెండు రోజులుగా ఉన్న వాతావరణమే శుక్రవారం కూడా కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం బలహీనపడిందని.. అయితే, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంపై ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది.