- చింతపల్లిలో నిబంధనలకు పాతర..?
-
అనుమతులు లేని అక్రమ వెంచర్ కలకలం.
-
డిటిసిపి, తదితర అనుమతులు లేకుండానే ప్లాట్ ల పునరుద్దరణ..
-
గడియ గౌరారం సర్వే నెంబర్ 24, 25 లో 8.24 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ రూపురేకలు..
-
ప్రశ్నించిన గడియ గౌరారం గ్రామస్తులు.. పంచాయతీ కార్యదర్శికి పిర్యాదు..
-
నోటీసులు జారి చేసి, తగిన చర్యలు తీసుకుంటాము- సెక్రటరీ..
చింతపల్లి (క్రైమ్ మిర్రర్):- నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం సమీపంలో, రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. గడియ గౌరారం గ్రామ పరిధిలో వెలిసిన ఈ అక్రమ వెంచర్ ఉదంతం, ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
నిబంధనలు గాలికి.. యథేచ్ఛగా సాగుతున్న పనులు
గడియ గౌరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 24, 25 లో సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో, కొందరు వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ, నుండి లేఅవుట్ అనుమతి పొందడం తప్పనిసరి.

నిబంధనల ప్రకారం.. వెంచర్ మొత్తంలో నిర్ణీత శాతం భూమిని రోడ్లు, సామాజిక అవసరాల కోసం గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి. నాలా కన్వర్షన్ ద్వారా వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చాలి.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి, తుది అనుమతి పత్రం పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి. అయితే, ఈ వెంచర్ విషయంలో అవేమీ పట్టించుకోకుండానే, రాత్రికి రాత్రే జెసిబిలతో రోడ్లు పోయడం, ప్లాట్లను మార్కింగ్ చేయడం వంటి పనులు పూర్తి చేయడం గమనార్హం.
ప్రశ్నించిన గ్రామస్తులు.. రంగంలోకి పంచాయతీ యంత్రాంగం
ఈ అక్రమ అభివృద్ధి పనులను గమనించిన, గడియ గౌరారం గ్రామస్తులు ఏకమై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు ఇబ్బందుల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనల విరుద్ధంగా సాగుతున్న ఈ దందాను, అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి, ప్లాట్లు అమ్మడం వల్ల పంచాయతీకి రావాల్సిన డెవలప్‌మెంట్ ఫీజులు, గ్రీన్ బెల్ట్ కోసం వదిలే స్థలాలు కూడా కబ్జాకు గురవుతాయని అన్నారు.

అధికారులు తక్షణమే స్పందించి, ఈ పనులను ఆపాలని గ్రామస్తులు పేర్కొన్నారు.గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పంచాయతీ సెక్రటరీ, ఈ వెంచర్ యజమానులకు ఎటువంటి అనుమతులు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చెయ్యనున్నట్లు వెల్లడించారు.
అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి, డిటిసిపి అనుమతి లేని ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోకుండా, రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..
