ఖానామెట్ భూకుంభకోణంపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఐటీ కారిడార్ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని బడా రియల్ ఎస్టేట్ సంస్థల చెర నుండి విడిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబర్ 55లో ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 8 ఎకరాలకు పైగా ఉన్న భూమిని హైడ్రా అధికారులు మంగళవారం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఐటీ హబ్‌కు అత్యంత చేరువలో ఉన్న ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 1200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలోని సర్వే నంబర్ 53లో ఉన్న మొండికుంట ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అప్పట్లో సర్వే నంబర్ 55లోని మరో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా చర్యతో ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూముల రక్షణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా అనుభవిస్తున్న సంస్థలు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అధికారులు ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఖానామెట్ సర్వే నంబర్ 55లోని భూమిని రెవెన్యూ రికార్డుల ప్రకారం అసైన్డ్ భూమిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని ఇప్పటికే ప్రోహిబిటెడ్ (నిషేధిత) జాబితాలో చేర్చారు. చట్టబద్ధంగా ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అయినప్పటికీ మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ తమదేనంటూ వాదిస్తోంది. మరోవైపు వాసవి నిర్మాణ సంస్థ అక్కడ ఆర్సీసీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం తాత్కాలిక షెడ్డులు వేయడంతో పాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రిని నిల్వ ఉంచింది. సుమారు 4.20 ఎకరాల భూమిని ఈ బడా సంస్థలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి.
అదే సర్వే నంబర్లో ఉన్న మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తనదిగా క్లెయిమ్ చేస్తూ వస్తున్నారు. ఆ భూమి చుట్టూ బౌన్సర్లను కాపలా ఉంచి ఇతరులెవరూ రాకుండా అడ్డుకున్నారు. ఈ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని నిర్ధారణ కావడంతో మంగళవారం ఉదయం నుండే హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి.
ఆపరేషన్ సమయంలో వాసవి సంస్థ ఏర్పాటు చేసిన ఆర్సీసీ ప్లాంట్‌ను ఆ సంస్థే స్వయంగా తొలగించుకుంది. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిస్తూ బోర్డులను పాతారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. ఐటీ కారిడార్‌లో ఇంత భారీ విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ALSO READ: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు షాక్.. మూడు రోజుల నిల్వ బిర్యానీ వేడివేడిగా వడ్డింపు!
