Human Skeleton Found at Delhi Airport: సాధారణంగా ఎయిర్ పోర్టులో భద్రతా తనిఖీలు జరుగుతాయి. కొంత మంది అక్రమంగా బంగారం, మాదక ద్రవ్యాలు, కొన్నిసార్లు నిషేధిత వస్తులను తీసుకొస్తూ దొరికిపోతుంటారు. కానీ, తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం
ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తుండగా, భద్రతా అధికారులు ఓ బ్రీఫ్ కేసు అనుమానాస్పదంగా కనిపించింది. దానిని ఓపెన్ చేసి చూసిన సిబ్బంది షాకయ్యారు. ఎందుకంటే, అందులో ఏకంగా అస్థిపంజరం కనిపించింది. కాసేపు అక్కడ కలకలం చెలరేగింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3 దగ్గర బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
ఎయిర్ పోర్టుకు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ లగేజీ బ్యాగ్ ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఓ మెడికల్ స్టూడెంట్ కు చెందినదిగా గుర్తించారు. బ్యాగులో ఉన్నది ఒరిజినల్ అస్థిపంజరం కాదని, మెడికల్ ఎడ్యుకేషన్ లో ఉపయోగించే డెమో అస్థిపంజరం అని పోలీసులు తెలిపారు.
ఫోరెన్సిక్ పరీక్షల కోసం..
ఈ ఘటనలో ఎలాంటి నేరానికి సంబంధం లేదని, అనుమానాస్పద పరిస్థితులు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ అది నిజమైన మనిషి అస్థిపంజరమా? లేదంటే విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించే నమూనానా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిజానిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.





