ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా ఒక వ్యక్తి మంచంపై పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయం చాలా మందికి పట్టించుకోని అంశమే.

సాధారణంగా ఒక వ్యక్తి మంచంపై పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయం చాలా మందికి పట్టించుకోని అంశమే. కానీ అదే సమయం ఎక్కువ అవుతుంటే అది నిద్రలేమికి తొలి సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. బిహేవియరల్ స్లీప్ మెడిసిన్ సైకాలజిస్ట్ డాక్టర్ మిచెల్ డ్రెరప్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యవంతులైన చాలా మంది వ్యక్తులు సగటున 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే నిద్రలోకి వెళ్తారు. శరీరం అలసటకు లోనైనప్పుడు, మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ సహజంగానే జరుగుతుందని ఆమె వివరించారు.

అయితే నిద్రలేమితో బాధపడుతున్న వారి పరిస్థితి భిన్నంగా ఉంటుందని డాక్టర్ మిచెల్ డ్రెరప్ తెలిపారు. అలాంటి వారు మంచంపై పడుకున్న తర్వాత కూడా చాలా సేపటివరకు నిద్ర రాకుండా తిప్పలు పడతారని, సాధారణంగా వారికి నిద్ర పట్టడానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. కొందరిలో అయితే గంటకు పైగా కూడా నిద్ర రాని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇది శారీరక అలసట కన్నా మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆలోచనల అధిక ప్రవాహం వంటి కారణాల వల్ల ఎక్కువగా జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిద్రపోవడంలో ఇబ్బంది 1, 2 రోజుల పాటు ఉంటే పెద్దగా ఆందోళన అవసరం లేదని, కానీ అది దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ మిచెల్ డ్రెరప్ హెచ్చరించారు. ముఖ్యంగా మూడు నెలలకు పైగా, వారానికి కనీసం మూడు రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా నిద్ర వచ్చినా మధ్యలో మేల్కొని మళ్లీ నిద్ర రాకపోవడం వంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎందుకంటే దీర్ఘకాలిక నిద్రలేమి శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె తెలిపారు.

నిద్రలేమి వల్ల రోజువారీ జీవితం పూర్తిగా ప్రభావితమవుతుందని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే పని సామర్థ్యం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు పెరగడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా నిద్రలేమి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిద్ర సమస్యలను చిన్నవిగా భావించకుండా, తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లకు అధికంగా అలవాటు పడటం, రాత్రివేళల్లో పని ఒత్తిడి, ఆందోళన వంటి అంశాలు నిద్రలేమిని మరింత పెంచుతున్నాయని వైద్యులు అంటున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, నిద్రకు ముందు స్క్రీన్ వినియోగాన్ని తగ్గించడం, ప్రశాంతమైన అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా కొంతమేర సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ సమస్య కొనసాగితే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: శృంగారం చేస్తుండగా భర్తను చంపిన భార్య.. ఆమై మరో ఘోరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button