
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ ఆధునిక కాలంలో చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు.. అక్కడ జీవనాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇక అసాధ్యం కాదన్న స్థాయికి శాస్త్రసాంకేతికం చేరుకుంది. భూమికి ప్రత్యామ్నాయంగా మనిషి ఎక్కడ జీవించగలడనే అంశంపై ఎన్నో ఏళ్లుగా సాగుతున్న పరిశోధనల్లో చంద్రుడు కీలకంగా మారాడు. ఇప్పటికే చంద్రుడిపై నీరు, ఖనిజాల లభ్యతపై స్పష్టత రావడంతో అక్కడ మానవ నివాసాలకు అనుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ చంద్రుడిపై ఏకంగా హోటల్ నిర్మాణానికి సిద్ధమవడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. కాలిఫోర్నియాకు చెందిన గెలాక్సీ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ సంస్థ చంద్ర పర్యాటకాన్ని వాస్తవంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాదే చంద్రుడిపై హోటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఆ ఆలోచనను అమల్లోకి తీసుకొస్తూ ముందడుగు వేసింది.
చంద్ర పర్యాటకాన్ని లూనార్ ఎకానమీకి తొలి మెట్టుగా భావిస్తున్న ఈ సిలికాన్ వ్యాలీ కంపెనీ.. సైన్స్ ఫిక్షన్‌గా అనిపించిన చంద్ర నివాసాల కలను నిజం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హోటల్ నిర్మాణ ప్రణాళికలతో పాటు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చంద్రుడిపై హోటల్ రిజర్వేషన్ ధరలు భారత కరెన్సీలో సుమారు 2.2 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయల వరకు ఉంటాయని వెల్లడించింది.
అయితే హోటల్ బుకింగ్ ఖర్చుతోనే ప్రయాణం పూర్తికాదని సంస్థ చెబుతోంది. చంద్రుడికి వెళ్లి అక్కడ హోటల్‌లో బస చేసి తిరిగి భూమికి వచ్చే మొత్తం ప్రయాణ వ్యయం 90 కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. దీనితో పాటు తిరిగి చెల్లించని వెయ్యి డాలర్ల అప్లికేషన్ ఫీజు కూడా తప్పనిసరి. డబ్బు ఉన్నంత మాత్రాన చంద్రయాత్రకు అనుమతి లభించదని, కఠినమైన అర్హత ప్రమాణాలు కూడా ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.
చంద్ర ప్రయాణానికి ఆసక్తి చూపే వారి మీద గట్టి బ్యాక్‌గ్రౌండ్ తనిఖీలు నిర్వహిస్తారు. శారీరకంగా, మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ఇది కేవలం విలాసవంతమైన ప్రయాణం మాత్రమే కాకుండా, అత్యంత ప్రమాదభరితమైన అంతరిక్ష యాత్ర కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సంస్థ అధికారులు తెలిపారు.
ఇక చంద్రుడిపై హోటల్ నిర్మాణానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం నిర్మాణ విధానం. భూమి నుంచి ఇటుకలను తీసుకెళ్లడం సాధ్యం కాదని గుర్తించిన జీఆర్‌యూ స్పేస్ సంస్థ, చంద్రుడిపై లభించే ధూళిని ఉపయోగించి అక్కడే ఇటుకలను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్మాణాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రమాదకర రేడియేషన్‌ను తట్టుకునేలా రూపొందించనున్నట్లు తెలిపింది.
2029లో తొలి పేలోడ్ ద్వారా ఈ సాంకేతికతను చంద్రుడిపై పరీక్షించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది కేవలం అంతరిక్ష పర్యాటక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, భూమికి ప్రత్యామ్నాయంగా నివాసయోగ్యమైన గ్రహంగా చంద్రుడిని తీర్చిదిద్దే తొలి అడుగు అని సంస్థ పేర్కొంటోంది. ఆర్థిక స్తోమతతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న సాధారణ ప్రజలు కూడా భవిష్యత్తులో చంద్రుడిపై అడుగుపెట్టే అరుదైన అనుభూతిని పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: FLASH: సీఎంకు బాంబు దాడి బెదిరింపు





