
High Court: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హైకోర్టు అత్యంత కీలక తీర్పును వెలువరించింది. దాంపత్య జీవితంలో మానసిక బాధ, భయం, నిరంతర ఒత్తిడి కూడా శారీరక హింసలాగే క్రూరత్వంలో భాగమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా భార్య తరచూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం, భర్తను మతం మార్చమని ఒత్తిడి చేయడం వంటి చర్యలను అత్యంత తీవ్రమైన మానసిక వేధింపులుగా పరిగణించింది. ఈ నిర్ణయంతో బలోద్ జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు పూర్తిగా సమర్థించింది.
2018 మేలో బలోద్ జిల్లాకు చెందిన దంపతులు పెళ్లి చేసుకుని కొద్దిరోజులు గడవకముందే వివాహ జీవితం పూర్తిగా గొడవలతో నిండిపోయిందని భర్త కోర్టులో వివరించాడు. భార్య తరచూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఏ చిన్న వివాదం జరిగినా విషం తాగుతానని చెప్పడం, కత్తితో తనను తాను గాయపర్చుకోవడం, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించడం వంటి చర్యలతో తాను నిరంతరం భయంతో జీవించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. ఈ సంఘటనలు తమ ఇంట్లో వరుసగా జరిగాయి కాబట్టి.. 2019 అక్టోబర్‌లో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ రజనీ దూబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్‌లు దాంపత్యంలో శారీరక హింస మాత్రమే కాదు.. మానసికంగా భయభ్రాంతికి గురిచేసే ప్రవర్తన కూడా చట్టపరంగా క్రూరత్వమేనని పేర్కొన్నారు. భర్తపై ఉన్న మానసిక ఒత్తిడి, నిరంతర భయం, బెదిరింపులు దాంపత్య జీవితాన్ని పూర్తిగా దెబ్బతీసే అంశాలని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక భార్య, ఆమె కుటుంబ సభ్యులు భర్తను ఇస్లాం మతంలోకి మార్చమని ఒత్తిడి చేసినట్లు భర్త తెలిపిన విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆరోపణకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు పరిశీలించగా, భర్త వాదనలో సరైన ఆధారాలు ఉన్నట్లు తేలింది.
2019 నవంబర్ నుంచే ఇద్దరూ విడిగా ఉంటున్నారని, దాంపత్య బంధాన్ని పునరుద్ధరించేందుకు భార్య ఎలాంటి ఆసక్తి చూపకపోవడం కూడా హైకోర్టు గమనించింది. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో భార్య ప్రవర్తన మానసిక క్రూరత్వానికి స్పష్టమైన ఉదాహరణ అని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఫ్యామిలీ కోర్టు భర్తకు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు నిలబెట్టింది. భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను పూర్తిగా కొట్టివేసింది. ఈ తీర్పు మానసిక వేధింపులు కూడా చట్టపరంగా ఎంత తీవ్రమైనవి అన్న దానికి ఒక ముఖ్య ఉదాహరణగా నిలిచింది.
ALSO READ: Tragedy: కుళ్లిన పన్నీర్, రసగుల్లాలు తిని 500 మందికి అస్వస్థత





