
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహంతో ఆదివారం ఉదయం నుంచి సింగూరు ప్రాజెక్టు సహా ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతుండగా, జలాశయం పూర్తిస్థాయికి చేరుకొనుంది. ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ అందించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 45,000 క్యూసెక్కుల వరదనీరు నిజాంసాగర్ జలాశయంలోకి చేరుతోందని తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 1399.92 అడుగులు నీటిమట్టంగా నమోదైంది. అలాగే, జలాశయం సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 11.277 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
ఇదిలా ఉంటే, సింగూరు ప్రాజెక్టులోకి 31,412 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సింగూర్ ప్రాజెక్టు నుండి 5 గేట్ల ద్వారా 43,634 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో జరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 అడుగులు, ప్రస్తుతం 521.750 అడుగులు కాగా, సామర్థ్యం 29.917 టీఎంసీలు, అందులో 20.778 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
ప్రాజెక్టు spillway ద్వారా 40,821 క్యూసెక్కులు, జెన్కోకు 2,180 క్యూసెక్కులు, సింగూరు లెఫ్ట్ కెనాల్‌కు 60 క్యూసెక్కులు, తలేల్మా లిఫ్ట్ ఇరిగేషన్‌కు 33 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఏస్‌కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూసెక్కుల వరదనీరు విడుదలవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే భారీ వరదప్రవాహం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశముండటంతో పూర్తిస్థాయి నిర్వహణ చర్యలు చేపట్టినట్లు సమాచారం.