
మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురవకపోయినా కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కృష్ణమ్మ జూలై మొదటి వారంలోనూ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే దాదాపుగా అన్ని కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో…జూరాలా, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లుఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 30వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. అటు తుంగభద్రతో పాటు.. సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. నాగార్జున సాగర్ కు ఎగువ శ్రీశైలం డ్యాం నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్ద్యం 312 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 200 టీఎంసీలకు చేరుకుంది. వరద నిలకడగా కొనసాగితే వచ్చే వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. జూలై రెండో వారంలోనే సాగర్ డ్యాం పూర్తిగా నిండిపోయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న వరద ప్రవాహం…
ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 1,48,736 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13,566 క్యూసెక్కులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 590.00 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 543.70 అడుగులు..
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312,0450
ప్రస్తుత నీటి నిల్వ 196.1229 టీఎంసీలు….
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.