తెలంగాణ

నేను త్యాగం చేస్తేనే వాడికి సీఎం పదవి.. రేవంత్‌పై రెచ్చిపోయిన కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు తీవ్రమవుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నాయకుల మధ్య వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమైన వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా హైకమాండ్ ను కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నరు. వరంగల్ నేతల హస్తిన పర్యటన వెనుక కీలక నేత హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. వరంగల్ కాంగ్రెస్ రచ్చ సాగుతుండగానే మరో సీనియర్ మంత్రి బాంబ్ పేల్చారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. తనకంటే పార్టీలో సీనియర్ ఎవరంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ ను ఉద్దేశించి సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు గాంధీభవన్ లో కలకలం రేపుతున్నాయి.

నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చింది నాకే హెలికాప్టర్‌ లేదంటారా అంటూ ఉన్నతాధికారిపై విరుచుకుపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటానంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హెలికాప్టర్ ఇవ్వడానికి నిరాకరించారు అధికారులు.ఇటీవల కాలంలో కోమటిరెడ్డి ఎక్కువగా హెలికాప్టర్ వాడుతున్నారు. వంద కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ లో వెళుతున్నారు. కోమటిరెడ్డి ప్రయాణాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో మంత్రులను కట్టడి చేయాలని సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హెలికాప్టర్ నిరాకరించారు అధికారులు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు. ముఖ్యమంత్రికి మాత్రమే హెలికాప్టర్‌ ఉపయోగించే వీలుంటుందని, మంత్రులు అత్యవసర సమయాల్లో మినహా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించే అవకాశం ఉండదని అధికారులు చెప్పడంతో వాళ్లపై కోపంతో ఊగిపోయారు కోమటిరెడ్డి. తాను వెళ్లే పని అత్యవసరం కాదనా మీ ఉద్దేశమా అని ప్రశ్నించారు. తాను త్యాగం చేస్తే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని అధికారిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటన సచివాలయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. మంత్రుల తీరుతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు సీఎస్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button