
కాళేశ్వరం ప్రాజెక్టును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పొగిడింది. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖచిత్రం మారింది.. 18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని తెలిపింది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడారు జస్టిస్ సతీశ్చంద్ర శర్మ. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని, ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 18 లక్షల ఎకరాలు సాగవుతోందని.. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి.. అందులో భాగంగానే తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారని తెలిపారు
వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంటసాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ పేర్కొన్నారు. ప్రాజెక్టులపై అర్థంపర్థం లేని ఆరోపణలు అసమంజసం ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదని పిటిషనర్లకు చురకలు అంటించారు.