నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో భారీ భూబాగోతం బయటపడింది. చిట్యాల శివారు.. మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం సర్వే నెం.34 లోని 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని(గుట్టలు) కొంతమంది కబ్జా చేసి మట్టిని విక్రయిస్తున్నారని శివనేని గూడెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత దేవనక దేవేందర్ ఆరోపించారు.
ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టలను ఇటాచి మిషన్లతో ధ్వంసం చేస్తూ మట్టిని విక్రయిస్తూ స్థానిక తహశీల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ, ఇతర సిబ్బంది కబ్జాదారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. ఈమేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుట్టల వెనుక కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ గుట్టలను తొలగించే భూకబ్జాదారులు రైతులను పొలాల్లోకి పోనివ్వకుండా మహిళలను అడ్డంపెట్టి అడ్డుకోవడంతో చేతికొచ్చిన పంట పొలాలు ఎండి పోయి రైతులు ఏమి చెయాలో తోచక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
అధికారులతో, బడా నేతలతో కబ్జాదారులు కుమ్మక్కు అయ్యారని అన్నారు. ఈ కబ్జాపై రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, రెవిన్యూ సిబ్బందికి, జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.