
Government: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బియ్యం, పంచదార, గోధుమలు వంటి నిత్యావసర వస్తువులు మాత్రమే రేషన్ షాపుల ద్వారా అందించబడుతున్నాయి. కానీ ఇటీవల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై ప్రజల ఆసక్తి పెరగడంతో ప్రభుత్వం రెండు కొత్త ధాన్యాలను కూడా రేషన్ జాబితాలో చేర్చింది. ఇకపై కార్డుదారులకు రాగులు, జొన్నలు కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ముఖ్యంగా పేద కుటుంబాలకు అదనపు భారాన్ని తగ్గించే చర్యగా చూస్తున్నారు.
ఇటీవలి వరకూ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే ఈ రెండు ధాన్యాల పంపిణీ జరిగింది. అక్కడ ఆరోగ్య లక్షణాల దృష్ట్యా వీటి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అదే నమూనాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలతో పాటు నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల నుంచే కొత్త పంపిణీ విధానం ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎఫ్‌సీఐ రాష్ట్రానికి సరిపడా రాగులు, జొన్నలు అందించేది. అయితే ఇప్పుడు సరఫరా తగ్గిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్వయంగా ఈ ధాన్యాలను సేకరించి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. బయట దుకాణాల్లో ఈ రెండింటి ధరలు అధికంగా ఉండటంతో పేద కుటుంబాలు వీటిని కొనడం కష్టంగా మారేది. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అందించడంతో ఆర్థికంగా కూడా ఊరటనిస్తోంది.
ప్రస్తుతం రేషన్ కార్డులో ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. కొత్త విధానంలో 20 కిలోల కోటాలో 2 కిలోల రాగులు, జొన్నలు ఇస్తారు. మిగతా 18 కిలోలు బియ్యం రూపంలో అందించనున్నారు. పోషక విలువల పరంగా కూడా ఈ ధాన్యాలు ఎంతో మంచివి కావడంతో ఆరోగ్య నిపుణులు కూడా ఇవి తినాలని సూచిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది. ఇంటికి సరుకులు తీసుకెళ్లే రేషన్ వాహనాలను నిలిపివేసి, స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు కూడా జారీచేసింది. ఇప్పటికే వేలాది కుటుంబాలు కొత్త కార్డులను పొందాయి. ఇప్పుడు రాగులు, జొన్నలు జోడించడం రేషన్ విధానంలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
ALSO READ: CM Good News: సంక్రాంతి నుంచి అన్నీ..





