
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఎనికెపల్లిలో గోశాల కోసం రైతుల సాగుభూములపై ప్రభుత్వం కన్నేసింది. ఈ ప్రాంతంలో 99.14 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించగా, రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులను భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు శుక్రవారం జరిగిన సర్వే సందర్భంగా తమ భూముల వద్దకు వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల్లోకి రానివ్వకపోవడం పట్ల రైతులు మండిపడి “మా భూములు మాకే కావాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
పాటలు పాడుతూ నిరసన తెలిపిన మహిళలు ఈ క్రమంలో మహిళలు పాటలు పాడుతూ ఆందోళన చేపట్టారు. తమ భూములను తీసుకోవద్దని ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి వినతులు పెట్టినట్టు రైతులు చెబుతున్నారు. సాగు భూముల్లో గోశాల ప్రతిపాదనను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని, ప్రభుత్వం ఈ నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
గోశాలపై రైతుల స్పష్టమైన ఆగ్రహం..!
మేము తలకిందులైనా సాగు చేసుకుంటాం, మా భూములపై గోశాలలు వద్దు. మా బతుకులు, భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంది. ఇంతకాలం పండగల్లాగా నాట్లు వేసిన ఈ భూములు ఒక్కసారిగా గోశాలకు ఇస్తామంటారా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే దీక్షలకు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం గోశాల నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే దీక్షలు, రోడ్డెక్కి పోరాటం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.