
Good News: తెలంగాణలో మహిళా సాధికారతను మరింత బలపర్చే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన వస్తోంది. రెండు సంవత్సరాల్లోనే మహిళలు రూ.251 కోట్లకుపైగా ప్రయాణాలు చేయడం ఈ పథకం ఎంత ఉపయోగపడుతోందో స్పష్టం చేసింది. అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని ఇంకా సౌకర్యవంతంగా మార్చే దిశగా RTC కీలక నిర్ణయానికి మొగ్గుచూపింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణించాల్సిన పద్ధతికి పూర్తిగా బ్రేక్ వేస్తూ, స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2026 మొదటి నెల నుంచే ఈ స్మార్ట్ కార్డులు ప్రజల్లోకి రానున్నాయని RTC వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకునే మహిళలు ప్రతి సారి ఆధార్ చూపించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో కార్డు వెంట లేకపోవడం వల్ల రాయితీ పొందలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కొత్త స్మార్ట్ కార్డు విధానాన్ని రూపొందించింది. ఈ కార్డులో లబ్ధిదారురాలి ఫోటో, పేరు, చిరునామా, ప్రాథమిక వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకీకరించనున్నారు. ఢిల్లీలో అమలులో ఉన్న ‘సహేలీ’ కార్డు తరహాలోనే తెలంగాణ స్మార్ట్ కార్డు ఉండనుందని సమాచారం.
వీటితో ప్రయాణం కేవలం వేగవంతం కాకుండా, ఎవరు లబ్ధిదారు, ఎవరు కాదు అనే సందేహాలు లేకుండా క్లియర్‌గా డేటా సిస్టమ్ ద్వారా రికార్డవుతుంది. ఒక చూపులోనే మహిళలకోసం ఉన్న రాయితీని కన్ఫర్మ్ చేసే విధంగా టెక్నాలజీ వ్యవస్థను రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.8,500 కోట్ల విలువైన ప్రయాణాలు జరిగినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ కొత్త పద్ధతి ఆర్థిక నిర్వహణకూ సహాయపడనుంది.
ఇవి మాత్రమే కాదు.. విద్యార్థుల బస్‌పాస్‌లను కూడా స్మార్ట్ కార్డుల్లోకి మార్చే పనిలో ఆర్టీసీ బిజీగా ఉంది. కొత్త విద్యాసంవత్సరం నుంచి హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. రాయితీలతో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఇదే కార్డు వర్తించనుంది. 2025లో ప్రవేశపెట్టాలనుకున్న ఈ ప్రాజెక్టు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డా.. 2026 మొదట్లోనే దీనిని అమలు చేసేందుకు RTC వేగంగా చర్యలు చేపట్టింది.
ALSO READ: Rivaba Jadeja: నా భర్త మాత్రమే మంచోడు!





