
మహిళల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే వ్యాపారాలు ప్రారంభించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ పథకం తోడ్పాటునిస్తోంది.
ఈ యోజనలో భాగంగా మహిళలకు ముందుగా నైపుణ్య శిక్షణ అందిస్తారు. వ్యాపార నిర్వహణ, ఆదాయ వ్యయాల లెక్కలు, చిన్న పరిశ్రమలు ప్రారంభించే విధానం వంటి అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. శిక్షణ కాలంలో మహిళలకు స్టైఫండ్ కూడా ఇవ్వడం వల్ల కుటుంబ ఆర్థిక భారం పడకుండా శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
శిక్షణ పూర్తైన అనంతరం మహిళలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తారు. మైక్రో క్రెడిట్ కంటే కూడా తక్కువ వడ్డీకి గరిష్టంగా రూ.1.40 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తాన్ని చిన్న వ్యాపారాలు, సేవా రంగాలు, తయారీ కార్యకలాపాల్లో పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు ఈ పథకంలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
ఈ పథకం పొందాలంటే మహిళ వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. మంజూరైన రుణాన్ని మూడేళ్లు లేదా ఐదేళ్ల వ్యవధిలో సులభమైన విడతలుగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు NSFDC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫారాన్ని డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో పాటు రాష్ట్ర చానలైజింగ్ ఏజెన్సీ కార్యాలయంలో సమర్పించాలి. అక్కడ అనుమతి లభించిన తర్వాత బ్యాంకు ద్వారా రుణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధంగా మహిళల కలలను నిజం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన ద్వారా అండగా నిలుస్తోంది.
ALSO READ: చద్దన్నం తింటే ఏమవుతుందో తెలుసా?





