జాతీయం

Yogi Meets Modi: మోడీని కలిసిన యోగీ.. మ్యాటర్ ఏంటంటే?

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని మోడీని కలిశారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిశారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ, 2027లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. యూపీ అభివృద్ధి ప్రణాళికలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కూడా ఉభయ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా యోగి ఆదిత్యనాథ్ కలుసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరుగునుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 సంక్రాంతి రోజున యూపీ మంత్రివర్గ విస్తరణ

ఉత్తరప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ, సంస్థాగత మార్పులు అనేవి ప్రస్తుతం పార్టీ ఎజెండాలో ఉన్నాయి. జనవరి 14-15లో మకర సంక్రాతి పర్వదినం పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు కమిషన్లు, బోర్డులు, కౌన్సిల్స్‌కు కూడా రాజకీయ నియామకాల ప్రక్రియ త్వరలో చేపడతారు. ఇటీవల బీజేపీలో పలు ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను ఇటీవల ఎన్నుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరిని ఎన్నుకున్నారు. ఆ పదవికి పంకజ్ చౌదరి ఒక్కరే నామినేషన్ వేశారు.

మంత్రివర్గ విస్తరణపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం

డిసెంబర్ 30న యోగి ఆదిత్యనాథ్ లక్నో నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 54 మంది మంత్రులున్నారు. గరిష్టంగా 60 మందిని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ కావచ్చని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button