Germany Visa Free Transit To Indians: భారతీయులకు జర్మనీ అద్భుతమైన న్యూస్ చెప్పింది. జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు ట్రాన్సిట్ వీసా ఫ్రీ జర్నీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మర్ట్స్ భారత పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారత్‌లో రెండు రోజులు పర్యటించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు
ఇంతకీ ఏంటీ వీసా ఫ్రీ ట్రాన్సిట్?
జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులు గతంలో ట్రాన్సిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధన నుంచి ఇండియన్స్ కు తాజాగా జర్మనీ మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంతో భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తులు చేసుకోవడం, వీసా కోసం వేచి చూడటం లాంటి ఇబ్బందులు తీరనున్నాయి.
కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని మోడీ
భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పించినందుకు జర్మనీ ఛాన్సలర్‌కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
కీలక అంశాలపై ఇరు దేశాధినేతల చర్చలు
ఈ సందర్భంగా విద్యా రంగం, నైపుణ్యాలు సంబంధిత అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. భారత్, జర్మనీలు సంయుక్తంగా డ్యుయెల్, జాయింట్ డిగ్రీ కోర్సులను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉన్నత విద్యలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యకు సంబంధించి సమిష్టిగా ఓ ప్రణాళిక రూపొందించాలనీ నిర్ణయించారు. భారతదేశ నూతన విద్యావిధానం కింద జర్మనీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభించాలని కూడా ప్రధాని మోడీ ఆహ్వానించారు.





