
కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది. తీన్మార్ మల్లన్న బిసి ఏజెండాతో త్వరలోనే సొంతంగా రాజకీయ పార్టీ పెడతాడని కొందరు ఆయన సన్నిహితులు చెబుతుంటే, మరికొందరేమో లేదు… టిడిపిలోనో, తిరిగి బిజెపి లోనో చేరే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇంతకు తీన్మార్ మల్లన్న, రాజకీయ అడుగులు ఎటువైపు పడనున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ సొంత పార్టీ స్థాపించి విఫలం కాగా, ఆర్. కృష్ణయ్య పార్టీ పెడతానంటూ చెప్పి చివరకు టిడిపిలో చేరాడు.
టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కృష్ణయ్య, చివరకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని రాజ్యసభ సభ్యత్వాన్ని సంపాదించారు. ఏడాది తిరగకుండానే వైకాపాకు గుడ్ బై చెప్పి ఇప్పుడు బిజెపితో జతకట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఉద్యమాల ఐకాన్ లు వెలుగొందిన ఈ ఇద్దరు నేతలలో ఒకరు సొంత పార్టీ స్థాపించి ఇప్పటివరకు ప్రజా ప్రతినిధిగా గెలవలేకపోగా, మరొకరు ఇతర పార్టీలలో చేరి గతంలోఎమ్మెల్యే గా, ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నారు.
అలాగే తీన్మార్ మల్లన్న కూడా స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి, విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, విభజిత రాష్ట్రాల చరిత్రలోనూ సామాజిక ఉద్యమకారులు సొంతంగా పార్టీలను ఏర్పాటు చేసి సక్సెస్ అయిన దాఖలాలు లేకపోవడంతో తీన్మార్ మల్లన్న అటువంటి పొరపాటు చేస్తారా? అన్న ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. సొంత పార్టీ కాకుండా తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఏదైనా పార్టీలో చేరే అవకాశాలే ఉన్నాయన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.