
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారత పౌరుడి ప్రాథమిక విధి. పాఠశాల పిల్లలు సైతం జెండా ఎదుట నమస్కరిస్తూ, జాతీయ గీతాన్ని ఆలపించే ఈ సందర్భంలో, ప్రభుత్వ అధికారులు మరింత గౌరవం, మర్యాద చూపడం సహజం. అయితే, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో జరిగిన ఒక ఘటన జాతీయ పతాక గౌరవంపై ప్రశ్నలు రేపుతోంది.
మర్రిగూడ మండల ఫారెస్ట్ సెక్షన్ అధికారి అఖిలేష్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటప్పుడు, బూట్లు విప్పకుండానే కార్యక్రమం నిర్వహించారు. ఇది అక్కడి ప్రజల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ అధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. “జెండా పండుగ ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు చెప్పాల్సినవారే ఇలాంటి తప్పులు చేస్తే ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు.
సాంప్రదాయంగా, జెండా ఆవిష్కరణ లేదా జాతీయ గీతం సమయంలో పాదరక్షలు విప్పడం గౌరవ సూచికంగా పరిగణిస్తారు. కానీ ఈ నియమాన్ని పట్టించుకోకపోవడం, దేశ స్వాతంత్రం పట్ల అవగాహన లోపం లేదా బాధ్యతారాహిత్యంగా భావించబడుతోంది. ఈ ఘటనపై విభాగీయ స్థాయిలో స్పందన రావాల్సి ఉంది. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.