
Jaishankar Meets Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లతో వాణిజ్య యుద్ధానికి దిగితే.. ఇండియా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. అంతకు ముందే జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తో విస్తృతం చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.
ట్రంప్ టారిఫ్ ల తర్వాత సమావేశం కావడంతో..
ట్రంప్ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయకూడదంటూ ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ భేటీ జరగడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రధాన సంబంధాలలో భారత్-రష్యా సంబంధాలు అత్యంత స్థిరమైనవని జైశంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సంబంధాలు రాజకీయ సమన్వయం, నాయకత్వ సంప్రదింపులు, ప్రజల మధ్య సానుకూల భావనలతో నడుస్తున్నాయని వెల్లడించారు.
జై శంకర్ మూడు రోజుల రష్యా పర్యటన
3 రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ మంగళవారం నాడు రష్యాకు వెళ్లారు. పర్యటనలో భారత్-రష్యా మధ్య 26వ అంతర్-సర్కారీ కమిషన్ సమావేశానికి (IRIGC-TEC) జైశంకర్ అధ్యక్షత వహించారు. మాస్కోలో జరిగిన ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో జైశంకర్ పాల్గొన్నారు. భారత్, రష్యా రెండూ కలిసి తమ వాణిజ్య సంబంధాలను సమతుల్యంగా, స్థిరంగా విస్తరించాలని నిర్ణయించాయని ఆయన తెలిపారు. వాణిజ్యంలో అడ్డంకులైన నాన్-టారిఫ్ బ్యారియర్స్, రెగ్యులేటరీ హర్డిల్స్ ను తొలగించడం ఎంతో ముఖ్యం అన్నారు. ఈ అడ్డంకులు తొలగితే, రెండు దేశాల మధ్య వ్యాపారం మరింత సులభతరం అవుతుందని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో పుతిన్ భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో జైశంకర్ రష్యా పర్యటన కీలకంగా మారింది. ఈ చర్చలు అమెరికాకు గట్టి షాక్ కలిగేలా చేశాయి. ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే, చివరకు అమెరికాకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది.