
-
ఇది ప్రజాస్వామ్య పాలననా…?
-
ప్రభుత్వ అవగాహన సదస్సు అంటే భూములు కోల్పోతున్న రైతుల గొంతుక నొక్కడమా?
-
మీడియా స్వేచ్ఛను కూడా కొట్టి వేయడమా?
నాగర్‌కర్నూల్, (క్రైమ్ మిర్రర్): ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న రైతులపై ప్రభుత్వం ముందస్తు బంధన చర్యలు చేపట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు బల్మూరులో జరగనున్న భూ సేకరణ అవగాహన సదస్సును ప్రతిఘటిస్తారని భావించి… బల్మూర్, అనంతవరం, మైలారం గ్రామాలకు చెందిన రైతులను పొద్దున్నే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.
రైతులు ఎందుకు అరెస్టయ్యారు? ఎవరు అరెస్టయ్యారు? ఎన్ని మందిని అరెస్టు చేశారు? అనే ప్రశ్నలకు పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇక మిగిలిన రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా… పోలీస్ స్టేషన్‌లో ఉన్న రైతులను కలవడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా నిలిపేశారు. ఫోటోలు, వీడియోలు తీయొద్దంటూ పైనుంచి ఆదేశాలున్నాయని పోలీసులు చెప్పిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోతున్న రైతులు – “మాకు వాజిబు నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కుంటారా? మా అడిగే హక్కు కూడా లేకుండా ముందే అరెస్ట్ చేస్తారా?” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే, రైతుల నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.