•మంజీరా నదిలో కాలుష్యంతో చేపల మృతి
మత్స్యకార కుటుంబాల జీవనాధారం సంక్షోభంలో
•తాగునీరు, వ్యవసాయానికి ముప్పు
•శుద్ధి నీరు విడుదల చేయాలని డిమాండ్
•బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
•ప్రభుత్వం వెంటనే స్పందించాలి సిపిఎం నేత జయరాజు
హత్నూర, క్రైమ్ మిర్రర్:- సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు గ్రామ శివారులోని మంజీరా నదిని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు సందర్శించారు. నదిలో భారీగా చేపలు మృతి చెందిన పరిస్థితులను పరిశీలించిన ఆయన, దీనికి కారణమైన పరిశ్రమలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంజీరా జలాలు కలుషితం కావడంతో తాగునీరు, వ్యవసాయం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆయన తెలిపారు. పల్పనూరు గ్రామానికి చెందిన సుమారు 10 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, పరిశ్రమల నుంచి విడుదలైన కలుషిత నీటి కారణంగా టన్నుల కొద్దీ చేపలు మృతి చెందడం వల్ల వారి జీవనాధారం దెబ్బతిన్నదని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మంజీరా నదిలో పైభాగం నుంచి శుద్ధి నీటిని విడుదల చేయాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే కాలుష్యానికి కారణమైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
